ఔను… మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికూతురుగా ముస్తాబైంది. పెద్దల సమక్షంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లి తమన్నాకు ఇష్టం లేదు. వెంటనే మహేష్ బాబుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయనేమో… వెంటనే పెళ్లిమండపానికి చేరుకొని ఈ పెళ్లి ఆపేశారు. దాంతో.. శ్రీనువైట్ల కట్ చెప్పారు! తమన్నా పెళ్లేంటి? శ్రీనువైట్ల కట్ చెప్పడం ఏమిటి? అనుకొంటున్నారా? ఇదంతా ఆగడు షూటింగ్ కోసమండీ. మహేష్‌బాబు – శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘ఆగడు’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ పై సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘దూకుడు’ సినిమాకి మించిన వినోదం ఇందులో ఉంటుందని ముందునుంచీ శ్రీనువైట్ల చెబుతూనే ఉన్నారు. అన్నట్టుగానే ఈ సినిమాని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు శ్రీనువైట్ల. జూన్, జులైలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.