కేంద్రంతో క్రేజీవాల్ ఢీ!

ArvindProtestఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజివాల్ కేంద్రంతో యుద్దభేరికి రెడీ అయ్యారు. రైల్ భవన్ వద్ద రైసినా రోడ్డుపై నిన్న చేపట్టిన ధర్నా ఈరోజు(2వ రోజు) కొనసాగుతోంది. కేంద్రం దిగిరానట్లయితే.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని క్రేజివాల్ హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవటంతో పాటు.. ఢిల్లీ పోలీసు విభాగాన్ని కేంద్ర హోంశాఖ పరిధి నుంచి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ క్రేజీవాల్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

ఉద్యమానికి మద్దతుగా ప్రజలు తరలిరావాలని, నిజాయితీ పోలీసులు సెలవు పెట్టి ఉద్యమించాలని క్రేజివాల్ పిలుపునిచ్చారు. అయితే, ఢిల్లీ పాలనపై ధర్నా ప్రభావం ఏమీ ఉండదని, పాలన యధావిధిగా సాగుతుంది ఆయన అన్నారు. కాగా, ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం కూడా దీక్షాస్థలి వద్దే నిర్వహించాలని క్రేజీవాల్ నిర్ణయించినట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ ధర్నా దృష్ట్యా ఈరోజు కూడా 4 మెట్రో స్టేషన్లను మూసేశారు. ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగటం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి.