ఫిబ్రవరిలో సీఎం రాజీనామా… ??

cmkiran-pithaniరాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకు కదులుతోంది. అయితే, విభజన ప్రక్రియను ఏ దశలోనైనా ఆపుతానని ముఖ్యమంత్రి పలుమార్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి సీఎంపైనే కేంద్రికృతం అయింది. సీఎం కొత్త పార్టీ పెడతారా.. ? లేదా విభజన వ్యతిరేకింగా కీలక సమయంలో రాజీనామా చేసిన తన నిరసనను తెలియజేస్తాడా.. ? అనే విషయాలపై కాస్త ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి.

తాజాగా, ముఖ్యమంత్రి కిరణ్ ఫిబ్రవరిలో రాజీనామా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని నిన్న మంత్రి పితాని సత్యనారాయణ కూడా పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పితాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్ వచ్చే నెలలో రాజీనామా చేస్తారని, ఆ వెంటనే తాను కూడా రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.

మంత్రి పితాని కిరణ్ సన్నిహితుడే. కిరణ్ కావాలానే తన రాజీనామా గురించి పితాని చేత చెప్పించి వుండవచ్చుననే ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు. మరీ.. రాజీనామా అనంతరం ఈ సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తాడా.. ? లేదా.. కాంగ్రెస్ లోనే వుంటూ.. సమైక్యవాదంతో తన వర్గం వారిని గెలిపిచేందుకు ప్రయత్నిస్తారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఒక్కటి మాత్రం క్లియర్ అయినట్లే తెలుస్తోంది. అదే కిరణ్ రాజీనామా. మొత్తానికి సీఎం తన రాజీనామాకు ముహుర్తం ఖాయం చేసుకున్నారన్న మాట.