ఏపీ ఎన్జీవోల కార్యాచరణ ఖరారు కానుందా.. ?

All-Party-Meetingరాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అప్పట్లో సీమాంధ్ర తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలో సింహాభాగం మాత్రం ఏపీ ఎన్జీవోలదే అని చెప్పవచ్చు. దాదాపు 70రోజులకు పైగా.. సీమాంధ్ర బంద్ ను పాటించింది. సమైక్యాంధ్ర ఉద్యమం సెగ ఈ రేంజ్ లో ఉందా.. ? అనే ఆలోచనను కేంద్రానికి కలిగేలా చేయడం ఏపీ ఎన్జీవోలు సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. వీరికి తెదేపా, కాంగ్రెస్, వైకాపా సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా మద్దతు ప్రకటించారనుకోండి. అయితే, సీమాంధ్ర బంద్ ను ఉపసంహరించుకున్న అనంతరం ఏపీ ఏన్జీవోలు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

టీ-బిల్లు అసెంబ్లీకి వస్తే.. అసెంబ్లీని ముట్టడిస్తాం.. అని హెచ్చరించిన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు మాటలు కార్యరూపం దాల్చలేదు. పైగా.. ఏపీ ఏన్జీవోలలో విబేధాలు బగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల అఖిలపక్షం సమావేశమంటూ.. కొత్త దారికి తెరలేపారు ఉద్యోగులు. తాజాగా, ఈరోజు ఏపీ భవన్ లో మరోసారి అఖిలపక్ష సమావేశం జరగనుంది. జనవరి 3నుంచి చేపట్టాల్సిన కార్యచరణను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

అఖిలపక్ష భేటీలో ఖరారు చేయనున్న కార్యాచరణ ఎలా వుండబోతోంది. ఇప్పటికే టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చ కూడా ప్రారంభమైన నేపథ్యంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు ఏపీ ఎన్జీవోల కార్యచరణ ఎంత వరకు ఉపయోగపడుతుంది.. అనే విషయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.