హస్తినాలో రాష్ట్రపతి పాలన.. ?

New-Delhi

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయింది. భాజాపా 32 (భాజపా31+1అకాలీదల్) స్థానాలను కైవసం చేసుకుని ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 36. భాజాపా కు మరో 4గురు సభ్యుల మద్దతు అవసరం. అయితే, అధికారం కోసం అడ్డదారులు తొక్కదలచుకోలేదని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ప్రతిపక్షం వుండేందుకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు.

ఇక అవితీని వూడ్చేస్తామంటూ వచ్చి.. కాంగ్రెస్ కొట్టుకుపోయేలా చేసిన అమ్ ఆద్మీ పార్టీ 28స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాము ప్రతిపక్షంలో వుంటామని క్రేజీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ అమ్ ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దపడినట్లయితే.. కాంగ్రెస్ (8)తో జతకట్టక తప్పని పరిస్థితి. అందుకు ఆవ్ సిద్ధంగా లేదనేది స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్ని హస్తినాలో రాష్ట్రపతిపాలన దిశగా దారితీసే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలు హస్తినాలో రాజకీయ పార్టీలు ఎందుకు పొత్తులకు సిద్ధంగా లేవంటే.. మరో మూడు నాలుగు నెలల్లో వచ్చే సాధారణ ఎన్నికలే కారణమని తెలుస్తోంది. తమ సొంత అజెండాతో వచ్చే ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించి.. అటు పిమ్మట ఢిల్లీ పీఠంపై దృష్టి సారిద్దామనేది ఆయా పార్టీల ప్లాన్ గా కనిపిస్తోంది. మరోవైపు, నూతన గవర్నమెంట్ ఏర్పాటుకు గవర్నర్ నజీజ్ జంగ్ నిపుణులను సంప్రదించే పనిలో వున్నట్లు సమాచారం.