యముండా – అంటూ యమలీలలో కైకాల సత్యనారాయణ చేసిన హంగామా ఎప్పటికీ మర్చిపోలేం. అమ్మ ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకూ హాస్యనటుడిగా ఉన్న అలీని హీరోని చేసింది. అలీ 50 సినిమాలు హీరోగా చేసినా… అందులో నెం.1 ఇప్పటికీ యమలీలనే. చిన్న హీరోతో పెద్ద హిట్ కొట్టిన ఎస్.వి.కృష్ణారెడ్డిని ఈ సినిమా టాప్ దర్శకుడిని చేసింది. ఇప్పుడు మళ్లీ ఎస్.వి.కృష్ణారెడ్డి యమలీల కథని కొనసాగించే పనిలో పడ్డారు. అవును.. యమలీల 2 రాబోతోంది. విజయాల్లేక.. కొంతకాలం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఎస్.వి.కృష్ణారెడ్డి ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఫాంటసీ కథనే నమ్ముకొన్నారు. యమలీల కథని కొనసాగించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకొంటున్నట్టు సమాచారమ్. అల్లరి నరేష్‌ని కథానాయకుడిగా ఎంచుకొన్నట్టు తెలిసింది. ఎస్.వి కృష్ణారెడ్డి – నరేష్ కలయికలో వచ్చే తొలి చిత్రం ఇదే! యముడి పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారని తెలిసింది. యమదొంగలో తొలిసారి యముడిగా దర్శనమిచ్చారు మోహన్‌బాబు. ఆ సినిమాలో కలెక్షన్ కింగ్ నటన.. అందరికీ నచ్చింది. ఇప్పుడు మరోసారి యముండ.. అంటూ గర్జించబోతున్నారన్నమాట. మనీషా ఫిల్మ్స్ బ్యానర్‌పై కె. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం అద్భుతాలు సృష్టించిన ఈ కథ ఇప్పుడెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.