69పేజీలతో విభజన నివేదిక.. !

GOMవిభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం చివరి భేటీ ఈరోజు (మంగళవారం) జరగనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 5గంటలకు జీవోఎం సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలోనే విభజన నివేదికను ఖరారు చేయనున్నారు. తదనంతరం ఎల్లుండి జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు నివేదికను తీసుకెళ్లనున్నారు.

నివేదిక రూపకల్పనలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కీలక పాత్ర పోషించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు ఆయన విభజన నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నయ్యారు. దాదాపు 69పేజీలతో సిద్ధమైన విభజన నివేదికకు జీవోఎం ఈరోజు సాయంత్రం జరిగే భేటీలో ఆమోదముద్ర వేయనుంది. రాయల సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనే జీవోఎం ఓకే చేసినట్లు సమాచారం.

హైదరాబాద్ పై మాత్రం ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా వుండే హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలు విధించాలి. ఏయే అంశాలను గవర్నర్ కు కట్టబెట్టాలనే విషయాలు ఈ సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశం వున్నట్లు సమాచారం. మొత్తానికి.. ఇప్పటికే విభజన నివేదిక రెడీ అయింది. నివేదికను జీవోఎం ఆమోద్రవేయడమే తరువాయి. మరీ.. జీవోఎం ఖరారు చేసిన నివేదికలో ఏయే అంశాలు వున్నాయి. హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలు పెట్టారు.. ? అనే విషయాలు తెలియలాంటే.. మరి కొన్నిగంటలు ఆగాల్సిందే..