హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందే !

hyd-utసీమాంధ్ర కేంద్ర మంత్రులు ఎట్టకేలకు విభజనకు ఓకే చెప్పేశారు. అయితే, హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. విభజనపై ఏర్పాటైన జీవోఎం ఈరోజు చివరి భేటీ నిర్వహిస్తున్న నేపథ్యంలో..సీమాంధ్ర కేంద్ర ఈ ఉదయం కేంద్ర మంత్రి, జీవోఎంలో కీలక పాత్ర పోషిస్తున్న జైరాంరమేష్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ.. విభజన అనివార్యమైన నేపథ్యంలో..హైదరాబాద్ ను యూటీ చేయడంతో పాటుగా, భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలని కోరినట్లు జైరాం రమేష్ ను కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటుకోసం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, కొత్త రాజధానికి అవసరమైన భూమి, నీటికోసం కమిటీ పనిచేసేలా చూడాలని, సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని జేడీ శీలం పేర్కొన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, పనబాక, కిళ్లి కృపారాణి, కోట్ల, జేడీ శీలం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి చిరంజీవి హైదరాబాద్ విషయంలో తన బాణిని మరోసారి గట్టిగా వినిపించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని తెగేసి చెప్పారని సమాచారం. మొత్తానికి మెత్తబడ్డ సీమాంధ్ర కేంద్ర మంత్రులు విభజనకు మాత్రం ఓకే చెప్పేశారు. కాకపోతే.. సీమాంధ్ర మంత్రులందరూ.. హైదరాబాద్, భద్రాచలం, ప్యాకేజ్, సీమాంధ్రకు కొత్త రాజధాని, రైల్వే జోన్.. లపైనే తమ కోర్కెల చిట్టాను విప్పారు. దీంతో.. విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రానికి ఆపరేషన్ ’టీ’ మరింత సులువైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రుల విజ్ఞప్తులను విన్న జైరాం రమేష్.. సీమాంధ్ర ప్రాంత సమస్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఈరోజు మధ్యాహ్నం జరిగే పూర్తి స్థాయి జీవోఎం సమావేశంలో టీ-ముసాయిదాను ఆమోదించే అవకాశం వున్నట్లు సమాచారం. అనంతరం రేపు జరిగే కేబినేట్ ముందుకు వెళ్లనుంది. ఒకవేళ రేపు జరిగే కేబినేట్ లో సాధ్యపడని యెడల ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేకంగా కేబినెట్ ను సమావేశపరచి టీ-ముసాయిదాను ఆమోదించే అవకాశం వున్నట్లు సమాచారం.