ఆంక్షలు లేని తెలంగాణ : కేసీఆర్

shinde kcrవిభజనపై కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచి అడపాదడపా సభాసమావేశాల్లో తెలంగాణ పునర్మాణం, హైదరాబాద్ అంశాలపై కాస్త ఆవేశంగా వ్యాఖ్యలు చేశారు తెరాస అధినేత కేసీఆర్. అదే సమయంలో.. నేరుగా అధిష్టానంతో చర్చలు జరిపిన సందర్భాలు లేవనే చెప్పాలి. తాజాగా, రాష్ట్ర విభజన విషయంలో.. మంత్రుల బృందతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

* తెలంగాణపై ఎలాంటి పరిపాలనపరమైన నియంత్రణలు పెట్టకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. దేశంలోని మిగతా 28 రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం వుందో తెలంగాణ విషయంలో అదే వుండాలి.

* ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్ల నుంచి 5 యేళ్లు తగ్గించాలి. సీమాంధ్రులు ఇక్కడి నుండి పరిపాలించుకోవడం తప్ప మరో అధికారం ఇవ్వకూడదు.

* తెలంగాణలో అంతర్భాంగంగానే భద్రాచలం వుండాలి

* పదేళ్ల ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ భూపరిపాలన, హోం.. తదితర అంశాలు కేంద్రం చేతిలోకి తీసుకోకూడదు.. కోరలు లేని తెలంగాణతో పరిపాలన సాధ్యం కాదు.

* సీమాంధ్రలో చట్టబద్దంగా నిర్మించిన ప్రాజెక్టులకు మాకు అభ్యంతరం లేదు. కానీ.. అనుమతులు లేకుండా కట్టిన ప్రాజెక్టులకు కెటాయింపులు జరపరాదు. ఉదాహరణగా.. గాలేరునది, హందీనీవా, కండలేరు, సోమశిల, వెలిగోడు, చిత్రావతి,బ్యాలెస్సింగ్ రిజర్వాయర్, లింగాల కెనాల్.. మొదలైనవి.

* ఇక ఆంటోని కమిటీ చేసిన సిఫార్సులను కూడా కేసీఆర్ తప్పపట్టినట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం తెరాస కు అర్థగంట టైమ్ మాత్రమే కేటాయించినప్పటికినీ.. ఆ సమయం సరిపోదని కేసీఆర్ గంట టైం తీసుకొని మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఆంక్షలు పెట్టకూడదన్న కేసీఆర్ ను మంత్రులు కూడా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ’జాగో బాగో ’నినాదాలు, ఉద్యోగుల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. సీమాంధ్రులు హైదరాబాద్ లో కంటే..బెంగుళూరు, చైన్నైలలో ఎక్కువగా వున్నారని.. అక్కడలేని శాంతిభద్రతల సమస్య ఇక్కడెందుకు వస్తుందని సమాధానం చెప్పినట్లు సమాచారం. మెట్రోపాలిటన్ నగరాల్లో అన్ని ప్రాంతాల ప్రజలు వుంటారని ఎవ్వరికీ ఏ సమస్య రాదని కేసీఆర్ పేర్కొన్నారు.

సుమారు గంట పాటు కేసీఆర్, కెకె మంత్రుల బృందంతో సమావేశమయినప్పటికినీ అర్థగంట అనంతరం చిదంబరం బయటకు వచ్చేశారు. అటు పిమ్మట.. ఒక్కొక్కరు సమావేశం నుంచి బయటికి వచ్చిన అనంతరం కేసీఆర్ షిండేతో సమావేశం కొనసాగించారు. షిండే ఏకాంత చర్చల్లో తెరాస విలీన చర్చలు జరిగి వుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.