సీమాంధ్రకు ఎలా న్యాయం చేస్తారు.. ?

chiranjeeviకేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈరోజు (గురువారం) ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, జేడీశీలం, చిరంజీవి, కావూరి మొయిలీని కలిసిన వారిలో ఉన్నారు.

మొయిలీతో సమావేశం అనంతరం కేంద్ర మంత్రి చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. సీమాంద్రకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కోరామని అన్నారు. లక్షలమంది సీమాంద్రులు హైదరాబాద్ లో నివసిస్తున్నారని, వారికి పూర్తి రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. విభజన వల్ల నీళ్లు, నిదులు, విద్య, ఉద్యోగాలలో సమస్యలు వస్తాయని మొయిలీకి వివరించామని ఆయన అన్నారు. అయితే, సమన్యాయం చేశాకే విభజనపై ముందుకు వెళ్తామని మొయిలీ హామీ ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు.

మరో కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటి వరకు హైదరాబాద్ తప్ప ఇతర నగరాలు అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలపై మొయిలీతో చర్చించామని.. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరమని తెలిపారు. అయితే, రాజధానిగా వున్న హైదరాబాద్ అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ.55 వేల కోట్లు ఖర్చు అయ్యాయని వెల్లడించారు.