బెస్ట్ ప్యాకేజ్.. !

digvijyasingరాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అదేసమయంలో.. సీమాంధ్రకు బెస్ట్ ప్యాకేజ్ ఇస్తామని కూడా హామి ఇచ్చారు. విభజన విషయంలో కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బృందం దిగ్విజయ్ సింగ్ తోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. సీమాంధ్ర నేతలు ఢిగ్గీరాజాకు పలు ప్రశ్నలు సంధించారు. ఒకసారి అసంబ్లీకి తీర్మాణం, బిల్లు రెండు వస్తాయని.. మరోసారి బిల్లు మాత్రమే వస్తుందని.. ఇలా రకరకాలుగా ప్రకటనలు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని.. నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన విషయంలో కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిగ్గీరాజా మొహం ముందే.. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చెప్పేశారు. సీమాంధ్ర నేతల ఆవేదనను శాంతంగా విన్న దిగ్విజయ్ నవ్వుతూ మాట్లాడుతూనే.. చాలా దూరం వచ్చేశామని, విభజన విషయంలో ఇక వెనక్కి పోలేమని తేల్చి చెప్పేశారు. అయితే, విభజన విషయంలో.. సంప్రదాయాలు, పద్ధతులను పాటించేలా చూస్తామని, సీమాంధ్రకు ‘బెస్ట్ డీల్’ను ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.

ప్యాకేజీతో పాటుగా పలు విషయాలలో సీమాంధ్ర నేతలను కూల్ చేయడానికి ప్రయత్నించారు ఢిగ్గీరాజా. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని, వెనక బడిన ప్రాంతాలకు నిధులు కేటాయించడమే కాకుండా, హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. విభజన అంశాన్ని అటకెక్కించడానికి హస్తినా వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు కాస్త విచిత్ర పరిస్థితి ఎదురైనట్టు సమాచారం. ఎదురించడానికి వెళ్లి.. వెనుక నడిచినట్లుగా.. విభజనను ఆపడానికి వెళ్లి.. విభజనకు సహకరించినట్లుగా తయారైంది సీమాంధ్ర నేతల పరిస్థితి. మరి నిన్నటి వరకు రాష్ట్రం సమైక్యంగానే వుంటుందని కాలరెగరేసిన నాయకులు.. మరీ.. ఇప్పుడేమీ చెబుతారో..