లైట్ తీసుకుంటున్నారా?

congress-core-committeeఒకవైపు సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెతో రాష్ట్రం అట్టుడికి పోతోంది. విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో సీమాంద్ర ప్రాంతమంతా ఇప్పటికే అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం సీమాంధ్రలోనే కాదు రాష్ట్రమంతా చీకట్లో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ దీక్షలు మరోవైపు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సమ్మె నివారణకుగానీ, సమస్యలు పరిష్కరించేందుకుగానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నామమాత్రంగా మంత్రుల కమిటీని వేసి చేతులు దులుపుకుందేగానీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక రాజకీయ నాయకులు మాత్రం విద్వేశాలను చల్లార్చాల్సింది పోయి సందట్లో సడేమియా అన్నట్లుగా ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అధికార దాహంకోసం ప్రయత్నించే వారే కానీ ప్రజా సమస్యలను పరిష్కరిచేందుకు ఒక్క నాయకుడూ ముందుకు రావడంలేదు. పాలన పడకేసింది, సంక్షేమ పథకాలు కొనసాగడం గగనమైపోయింది. పనులు లేక ప్రజలు సస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం తన దూకుడు ధోరణిని మాత్రం వదలడం లేదు. ఒంటెద్దు పోకడను మాత్రం వీడడం లేదు. విభజన ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు మాత్రం చొరవ చూపడంలేదు. ఇంతకీ ఇవన్నీ తెలిసి కూడా చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారా? సీమాంధ్రలో జరిగే సమ్మెను, రాజకీయ నాయకుల దీక్షలను కేంద్రం లైట్ తీసుకుందా? చూస్తోంటే అలాగే అనిపిస్తోందంటున్నారు జనం. పరిస్థితి చేయిదాటక ముందే చర్యలు తీసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ తరువాత ఏం చేస్తే ఏం లాభం? ఢిల్లీ పెద్దలకు ఈ విషయం బోధపడినట్లు లేదు మరి.