ఆగిన విద్యుత్ సరఫరా..అంధకారంలో గ్రామాలు

SEEMANDHRAసమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో రాయలసీమలో అంధకారం నెలకొంది. సీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలో పాక్షికంగా కరెంట్ సరఫరా ఆగిపోయింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి డివిజన్లలో దాదాపు 400 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా :
విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని విజయవాడ, నూజివీడు, తిరువూరు, మైలవరం, హనుమాన్ జంక్షన్, గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెడన నియోజక వర్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

apngosతిరుమలకూ తప్పని పవర్ కట్ :

సీమాంధ్రలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ప్రజలనే కాక దేవుళ్లనూ తాకింది. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కూడా పవర్ కట్ సమస్యను ఎదుర్కొన్నాయి. ప్రఖ్యాతి గాంచిన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు దేవాలయాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే తిరుమల శ్రీవారి ఆలయానికి, తితిదే పరిపాలనా భవనానికి మాత్రం తితిదే సొంత ప్లాంటు నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును వాడుకుంటున్నారు. కానీ, ఈ సదుపాయం లేని శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానురు దేవాలయలలో మాత్రం చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.