సీమాంధ్ర కాంగ్రెస్ లో విబేధాలు

cm-kiranసీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఏ క్షణమైనా బద్దలయ్యేలా కనిపిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ పై పట్టుకోసం నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించడం కోసం పావులు కదుపుతున్నారు. విభజన ప్రక్రియ ఊపందుకోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ పై పట్టుకోసం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సమైక్య ఉద్యమం వల్ల కొంతకాలంగా విభేదాలు సద్దుమణిగినట్టు కనిపించినా తెలంగాణాపై కేబినెట్ కు ఆమోదముద్ర పడటంతో సీమాంధ్ర కాంగ్రెస్ లో మళ్లీ అంతర్గత కుమ్ములాటలు బట్టబయలవుతున్నాయి. సీమాంధ్రలో పార్టీపై ఆధిపత్యం కోసం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

సమైక్య ఉద్యమాన్ని ఆసరా చేసుకొని నేతలు సొంత పార్టీలోని ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తున్నారు. వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేసి,ముఖ్యమంత్రి కిరణ్ ఆ ప్రాంత కాంగ్రెస్ లో హీరో అయ్యారు. అంతేకాకుండా ఆయనకు సన్నిహితంగా ఉండే లగడపాటి తమలో కొంతమంది సమైక్య ద్రోహులున్నారంటూ ప్రత్యర్థి శిబిరాన్ని టార్గెట్ చేశారు. దీంతో కిరణ్ దూకుడుకు కళ్ళెం వేసేందుకు ప్రత్యర్ధి వర్గం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

సిఎంపై డొక్కా చేసిన విమర్శలతో సీమాంధ్ర కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేబినెట్ లో టి నోట్ ఆమోదం పొందిన తర్వాత కుమ్ములాటలు మరింత ముదిరాయి. అంత సడన్ గా కేబినెట్ ముందుకు టి.నోట్ రావడానికి కారణం ఆనం ఇంట్లో జరిగిన సమావేశమేనని లగడపాటి చేసిన వ్యాఖ్యలు నేతల మధ్య విభేదాలను మరింత పెంచాయి.మొత్తం మీద విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కల్లోలంలో ఉన్న కాంగ్రెస్ కు నేతల అంతర్గత కుమ్ములాటలు మూలిగే నక్కపై తాటిపండులా మారాయి.