ఏమిటీ సెన్సార్ గొడ‌వ‌

Doosukelthaఎప్పుడూ లేని విడ్డూరాలు సెన్సార్ బోర్డులో జ‌రుగుతున్నాయి. ధ‌న‌ల‌క్ష్మి వెర్సస్ మంచు ఫ్యామిలీ మ‌ధ్య గొడ‌వ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. దేనికైనా రెడీ విష‌యంలో జ‌రిగిన గొడ‌వ‌.. అనంత‌ర ప‌రిణామాలూ ఇప్పటికీ క‌ళ్లముందు క‌ద‌లాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మ‌ళ్లీ దూసుకెళ్లాకీ అదే స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఈసారి ట్రైల‌ర్‌నే అడ్డుకొనే ప్రయ‌త్నం చేస్తోంది ధ‌న‌ల‌క్ష్మి. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం దూసుకెళ్తా. ఈ సినిమాని ఈనెల 11న విడుద‌ల చేయాల‌నుకొంటున్నారు. థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ సెన్సార్ ముందుకు తీసుకెళ్తే ఈ ప్రచార చిత్రానికి U స‌ర్టిఫికెట్ ఇవ్వడానికి ధ‌న‌ల‌క్ష్మి నిరాక‌రించింది. దాంతో విష్ణు ఈ ట్రైలర్‌ని రివ్యూ క‌మిటీకి పంపారు. తెలుగు చ‌ల‌న చిత్ర చరిత్రలోనే ఓ ప్రచార చిత్రం విష‌యంలో ఇలాంటి స‌మ‌స్య రావ‌డం, దాన్ని రివ్యూ క‌మిటీకి నివేదించ‌డం ఇదే తొలిసారి.

ఇదేమైనా సినిమానా?? జ‌స్ట్ ట్రైల‌ర్‌. దానికే ఇంత రాద్దాంత‌మా? సినిమాకి ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పైపెచ్చు ఏ స‌ర్టిఫికెట్ ఇస్తే… మ‌రీ మంచిది అనుకొంటున్నారు. అలాంటిది ట్రైల‌ర్‌కి ఏ ఇస్తే.. చూడ‌డం మానేస్తారా? మ‌రీ ఓవర్ కాక‌పోతే..? దాన్ని రివ్యూ క‌మిటీకి నివేదించ‌డం ఎందుకూ..? ఈ విష‌యంలో అటు ధ‌న‌లక్ష్మి, ఇటు విష్ణు ఇద్దరూ అతి చేశార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ఈ గొడ‌వ ఇక్కడ మొద‌లై, ఇంకెక్కడ ఆగుతుందో..?