భగ్గుమన్న సీమాంధ్ర

seemandra-jobersకేంద్ర కేబినేట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తోందన్న వార్తల నేపథ్యంలో.. సీమాంధ్ర ఒక్క సారిగా భగ్గుమంది. ఆందోళనకారులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, గల్లా అరుణకుమారి.. తదితరుల ఇళ్లను ఆందోళన కారులు ముట్టడించారు. దీంతో.. మంత్రి నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నోట్ తో పాటుగా, అసలు విభజన ప్రక్రియనే వెనక్కు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. పైగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ కూడా ప్రజాప్రతినిధుల నివాసాల ముట్టడికి పిలుపునివ్వడంతో.. ఉద్యమ తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు గానీ, ఇతర సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే వారు గానీ వారి వారి భవిష్యత్ రూపొందించడంలో బిజీబిజీగా వున్నారు. మరికొన్ని గంటల్లో ఇటు ప్రజాప్రతినిధుల భవిష్యత్ కార్యాచరణ, అటు సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ కార్యచరణ తయారుకానుంది. దీంతో.. ఆందోళనలు మరింతగా చెలరేగ అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఒక పక్క సీమాంధ్ర నిరసనలతో భగ్గుమంటుంటే.. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేయడం విశేషం. కాగా, దిగ్విజయ్ వ్యాఖ్యల పట్ల పలువురు సీమాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.