మళ్లీ ఢిల్లీకి…

chandrababu naiduచంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళ్లారు. ‘సిటిజన్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై ఆసక్తి నెలకొంది. సిటిజన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. ఇదే కార్యక్రమంలో నరేంద్ర మోడీ ముగింపు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. అందుకే రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. బీజేపీ-టీడీపీల మధ్య పొత్తు పొడవబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పై దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే, ఇద్దరు కలిసి దర్శనం ఇస్తారా… ఎవరికి వారుగా పాల్గొంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం 12.20కి చంద్రబాబు ప్రసంగం ఉంది. సాయంత్రం మోడీ ప్రసంగిస్తారు. మోడీ వచ్చే వరకు బాబు వేదిక పై ఉండే అవకాశం లేదు. మోడీ తన ప్రసంగ సమయానికంటే ముందే వస్తే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పై దర్శనమిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పై చంద్రబాబు పరోక్షంగా తన మనోగతాన్ని వెల్లడించారు. 1989లో దేశంలో క్లిష్టపరిస్థితి ఉన్నప్పుడు… బీజేపీ-లెఫ్ట్ పార్టీలను ఒకే వేదిక పైకి తెచ్చిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పడం ద్వారా బీజేపీ-లెఫ్ట్ ల కలయిక అవసరమన్న భావాన్ని బాబు పరోక్షంగా వ్యక్తం చేశారు.