అశోక్ బాబు అప్రస్తుత ప్రసంగాలు !

ashok babuసమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎ పి ఎన్ జి ఓ నేత అశోక్ బాబు కు ఊహించని రీతిలో సీమాంధ్ర ప్రాంత ప్రజలు పట్టం కడుతున్నారు. ఉద్యమ నిర్వహణకు సంబంధించి ఉద్యోగులతో బాటు సామాన్య ప్రజలు కూడా ఆయన ఆదేశాలను, కార్యాచరణ ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఉద్యమ సభల్లో ఆయన ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన ప్రసంగాలకు ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒకవిధంగా ఈ ఉద్యమం కారణంగా అశోక్ బాబు సీమాంధ్ర లో హీరోగా ఎదిగాడంటే ఆశ్చర్యం లేదు. కేవలం ఉద్యమ లక్ష్యాలకు, ఆశయాలకు లోబడి వివాదరహితంగా అశోక్ బాబు చేస్తున్న ప్రసంగాలు ఆయన పరిణతికి, సంయమనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే గత కొద్దిరోజులుగా వివిధ సభల్లో అశోక్ బాబు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికలలో సమైక్యాంధ్ర ను బలంగా కోరుకునే నాయకుడికే అందరూ వోటు వెయ్యాలనీ,అటువంటి పార్టీ కే అధికారం కట్టబెట్టాలని, రానున్న ఎన్నికలలో ఉద్యోగులకు, ఉద్యోగసంఘాల నాయకులకు అధికశాతం సీట్లు కేటాయించాలంటూ అశోక్ బాబు చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల గురించి, పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో ఆరునెలల తరువాత జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నారని, ఇది పూర్తిగా అప్రస్తుత ప్రసంగమని వారు విమర్శిస్తున్నారు. తాను రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే లేదని, తమ సభలకు రాజకీయ నాయకులను అనుమతించబోమని పలు సార్లు చెప్పిన అశోక్ బాబు ఎందువల్ల ఇలా అకస్మాత్తుగా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమే సమైక్యాంధ్ర కు తమ మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబునాయుడు రెండు ప్రాంతాలకు సమన్యాయం అనే జెండా భుజాన వేసుకున్నారు.

అంటే అశోక్ బాబు కిరణ్ కు వోటు వేయమంటున్నారా ? లేక జగన్ కు పట్టం కట్టమంటున్నారా ? అన్నది ప్రస్తుతం సమాధానం దొరకాల్సిన ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇప్పటికే అశోక్ బాబు వెనుక కిరణ్ కుమార్ వుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా అశోక్ బాబు మరింత జాగ్రత్తగా తన ప్రసంగాలను రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా వుందనేది నిజం. అప్పుడే ఆయన నిజమైన నాయకుడిగా నిలిచిపోతారు.