డీల్ కుదిరితే.. జైలుకెందుకు వెళతా.. ?

jaganసీమాంధ్రలో పాగ వేయడానికి వైకాపా అధినేత వైఎస్ జగన్ తన వ్యూహాలకు పదను పెట్టినట్లు కనిపిస్తోంది. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేల బృందంతో కలసి ఈరోజు రాజ్ వన్ లో గవర్నర్ రాజనరసింహన్ ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ.. జగన్ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. అంతేకాకుండా త్వరలోనే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం తీర్మాణం చేయాలని గవర్నకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తో వైకాపా కుమ్మక్కైందన్న వార్తలొస్తున్నాయంటూ… విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. నిజంగానే కాంగ్రెస్ తో డీల్ ఉంటే పదహారు నెలలపాటు జైలులో ఎందుకు ఉండాలని జగన్ ప్రశ్నించారు. అసలు కేసే ఎందుకు వస్తుందని ఆయన అన్నారు. అనేక సార్లు సుప్రింకోర్టు కు వెళ్లాం అని, మొదట సుప్రింకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చిందని, ఆ తర్వాత తమ లాయర్లు సమీక్ష అడిగితే.. ఆరు నెలల కండిషన్ కూడా తీసివేసిందని, ఆ తర్వాత మళ్లీ సుప్రింకోర్టు నాలుగు నెలల గడువు పెంచిందని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం మూడు నెలల వ్యవధిలో బెయిల్ రావాల్సి ఉండగా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాను లౌకికవాదిని అని ప్రతి పార్టీ లౌకికవాదంతో ఉండాలని అన్నారు. పనిలో పనిగా మోడీ పరిపాలనను ఆయన మెచ్చుకున్నారు. మొత్తానికి సీమాంధ్రలో జగన్ హీరో కావడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.