ధిక్కార స్వరం…

cm kiran.jpjముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు.రాష్ట్ర సమైక్యతకంటే సీఎం పదవి ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్ తరాల వారు క్షమించరని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి, రాజకీయ నిర్ణయానికి తేడా ఉంటుందని, విభజన ప్రకటన జరిగి 60 రోజులవుతున్నా ఇంత వరకు సీమాంధ్రులకు కేంద్ర భరోసానివ్వలేకపోయిందని ఆయన అన్నారు. ఇప్పుడు తీసుకున్నది ముమ్మాటికి రాజకీయ నిర్ణయమే అన్నారు. తాను అన్ని ప్రాంతాలకు సీఎంను అంటూనే సమైక్యవాదినని నొక్కి చెప్పారు.

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ను సీఎం కిరణ్ ఘాటుగా విమర్శించారు. దిగ్విజయ్ అంటూ ఏకవాక్య సంభోదన చేయడమే కాకుండా ఆయనేమీ శాశ్వతం కాదన్నారు. ఆయన తనను సమైక్యాంధ్ర సీఎం అన్నప్పుడల్లా సమైక్యాంధ్రకోసం ఇంకా ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుందని చెప్పారు. నెహ్రూ, పటేల్ కలిపిన ఈ బంధాన్ని విడదీయడం అంత సులువు కాదని అన్నారు. నీటి సమస్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమ్మెవల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నందువల్ల ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరారు. సీఎం పదవికంటే ప్రజలే ముఖ్యమని తేల్చి చెప్పారు.పదవిని మాత్రమే వీడతానని కాంగ్రెస్ పార్టీని వీడనని చెప్పారు. కొత్త పార్టీ వార్తలను ఆయన ఖండించారు.

సీఎంగా తాను, జనరల్ సెక్రటరీగా దిగ్విజయ్ సింగ్ శాశ్వతం కాదు అంటూ ప్రజలు మాత్రమే శాశ్వతమన్నారు. సీఎం చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయపార్టీవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే సీమాంధ్రలో హీరో అవడానికే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించినట్లయింది. ఈ వ్యాఖ్యలు ముందుముందు ఎలాంటి రాజకీయమలుపులకు కారణమవుతాయో మరి…