ఇక మరింత ముందుకు

apngos‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహించిన తరువాత ఏపీఎన్జీవోలు ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించలేదు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉద్యమం ప్రారంభించి దానిని ప్రజలలోకి తీసుకెళ్లిన వీరు ఉద్యమాన్ని అదే స్థాయిలో కొనసాగించేందుకు ప్రణాళికలేవీ తయారు చేసుకోలేదు. రాష్ట్ర రాజధానిలో సభజరిగి వారం రోజులు గడిపోయింది.ఇక ఉద్యమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళదామనే విషయాన్ని చర్చించేందుకు నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన ఏపీఎన్జీవో నాయకులు హాజరవుతున్నారు.ఇప్పటి వరకు వివిధ రూపాలలో తమ నిరసనలు తెలియజేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఏపీఎన్జీవోలు ఇక ముందు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.సీమాంధ్ర మంత్రులు,ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఒత్తిడి పెంచడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా,సమన్యాయం వైపు అడుగులు వేసేలా ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఏపీఎన్జీవోలు భావిస్తున్నారు.సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమవడంతో ఇక ఢిల్లీలో సభ నిర్వహించే ప్రతిపాదనను కూడా వారు ఆలోచిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలని సమాలోచనలు చేస్తున్నారు.