లోక్ సత్తా జెపీకి విభజన-సమైక్య తత్వాలు బోధపడ్డాయి !

JPఏదన్నా అనుభవిస్తే గానీ తర్కం బోధపడదు అని నానుడి. అది ఈవేళ కర్నూలులో లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ కి సమైక్య సెగ ద్వారా అనుభవ పూర్వకంగా తెలిసింది. అందరూ యాత్రలు చేస్తున్నారు కదా, నేను వెనుకబడిపోతాను అనుకొన్నారేమో తెలియదు కానీ, జేపీ.. నేను సైతం అంటూ ‘తెలుగు తేజం’ అని పేరెట్టేసుకొని కర్నూల్ కు విచ్చేశారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా బహుశా విభజన విషయం పైన ఏ అభిప్రాయం చెప్పని పార్టీ ఒక్క లోక్ సత్తా నేమో.. ! కానీ ఆశ్చర్యకరంగా ఎవ్వరూ కూడా ఇంత వరకు లోక్ సత్తా పార్టీ ని రాష్ట్ర విభజన పై మీ అభిప్రాయం చెప్పండి అని పెద్ధగా అడిగిన ధాఖలాలు లేవు.

యాత్ర అంటూ కర్నూలు కు వచ్చిన జెపీ మామూలుగా ఎప్పుడూ చెప్పెటట్లుగానే, సమైక్యంగా వున్నా, విభజన జరిగినా సామరస్యంగా వుండాలని.. సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం ఈసారి ఊరుకోలేదు. ఈ సూక్త్లులు పక్కన పెట్టి మీరస్సలు సమైక్య వాదమా..?  విభజన వాదమా.. ? చెప్పాలంటూ ఆయనను ఘోరావ్ చేశారు. ఆయన సమైక్య వాదినని ఒప్పుకోక పోవడంతో.. జనం నినాధాలు చేయడం ప్రారంభించారు. అంతటితో ఆగక ఆయన చేతిలో నుంచి మైక్ కూడా లాక్కున్నారని వార్తలు వచ్చాయి. ఇక విధిలేక తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళిపోయారు జేపీ.

సరే పోనీలే తెలంగాణలో పరిస్థితి బాగుందా అంటే అక్కడ కర్నూల్ లో ప్రసంగం మొదలు పెట్టగానే.. ఇక్కడ తెరాస నేతలు ఆయన మీద మాటల దాడి మొదలెట్టేశారు. అసలే ఈ సారి కూకట్ పల్లిలో గెలవడం కష్టం అనుకుంటున్న పరిస్థితులలో జె పీకి ఇన్ని వ్యతిరేకతలు ఒక్క సారిగా చుట్టుముట్టాయి. ఇప్పటికన్నా జెపీ గారు రాష్ట్రంలో రగులుతున్న సమస్య మీద యేదో ఒక అభిప్రాయం చెప్పగలిగితే బాగుంటుందేమో. కనీసం ఒక్క ప్రాంతం వారన్నా సమర్ధిస్తారేమో!!