విభజన ఆపి తీరాల్సిందే.. !

ys vijayammaరాష్ట్ర విభజనకు సంబంధించి తమ పార్టీ వైఖరి అప్పుడు, ఇప్పుడు ఒకటేనంటూ వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఈసారి హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాసిన ఆమె.. విభజనపై ఓ తండ్రిలా నిర్ణయం తీసుకోమన్నామని పేర్కొన్నారు. అది కూడా రెండు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని ఇటీవల షిండే చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బీజేపీ, తెదేపా, టీఆర్ ఎస్, సీపీఐ పార్టీలు మాత్రమే అనుకూలమని ప్రకటించాయని, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం పార్టీలు విభజనను వ్యతిరేకించాయని ఆమె పేర్కొన్నారు. అలాంటప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా వున్న మీరు (షిండే) తమ పార్టీ వైఖరిని వక్రీకరించడం దురదృష్టకరమని.. అనేకసార్లు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసిందని విజయమ్మ చెప్పుకొచ్చారు. హోంమంత్రికి రాసిన లేఖకు గతంలో ఆ పార్టీ రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలను కూడా జత చేయడం విశేషం. సీమాంధ్రలో 40రోజులకు పైగా లక్షల్లో ప్రజలు రోడ్లమీదకు వస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కూడా ఆమె లేఖలో ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆపి తీరాల్సిందేనని విజయమ్మ డిమాండ్ చేశారు. కాగా, గతంలో సమన్యాయం చేయని పక్షంలో సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేసిన వైకాపా.. ఇప్పుడు అసలు తాము పూర్తిగా విభజనకు వ్యతిరేకమని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖల మీద లేఖలు రాయడం విశేషం. ఇదేనేమో.. రాజకీయ చతురత అంటే.. !