నటుడు, దర్శకుడు, స్ర్కీన్‌ప్లే రచయిత, గాయకుడు, ఫైట్ మాస్టర్, కొరియో గ్రాఫర్ – ఇలా పవన్ కల్యాణ్‌లో ఎన్ని కోణాలున్నాయో. ఇప్పుడు నిర్మాతగానూ విశ్వరూపం చూపించబోతున్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ పేరుమీద పవన్ ఓ బ్యానర్‌ని స్థాపించాడు. తొలిసారి సత్యాగ్రహి సినిమాని తీద్దాం అనుకొన్నాడు. అది కార్యరూపం దాల్చలేదు. గబ్బర్ సింగ్ సినిమా కూడా ఇదే బ్యానర్లో తీద్దాం అనుకొన్నాడు. కానీ కుదర్లేదు. తీన్మార్ తీసి నష్టపోయిన బండ్ల గణేష్ కోసం ఆ సినిమా వదులుకొన్నాడు. ఈసారి గబ్బర్ సింగ్ 2 మాత్రం తన సొంత నిర్మాణ సంస్థలోనే తీస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా స్నేహితుడి కోసమే. అయితే త్వరలో పవన్ నిర్మాతగా బిజీ అవడానికి చూస్తున్నాడు. తక్కువ బడ్జెట్లో నాణ్యమైన సినిమాలు తీసి.. కొత్తవారిని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నాడు. కోబలి కూడా పవన్ కల్యాణ్ సంస్థ నుంచే వస్తోంది. మొత్తమ్మీద ప్రొడ్యూసర్‌గానూ తన పవర్ చూపిస్తాడన్నమాట.