సమైక్యాంధ్ర సభ ఏం చెబుతోంది ?

apngosశనివారం నాడు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో జరిగిన సమైక్యాంధ్ర సభ ఎవరూ ఊహించని రీతిలో జయప్రదం కావటంతో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి. ఉద్రిక్తతలు, ఆవేశకావేశాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళ మధ్య అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య జరిగిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావటంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. ఎన్ని అవరోధాలు, బెదిరింపులు, ఆటంకాలు ఎదురైనప్పటికి సీమాంధ్ర లోని పదమూడు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలనుంచి సభ మొదలవుతుంది అని ప్రకటించినా ఉదయం పది గంటల నుంచే ఉద్యోగులు స్టేడియం కు రావటం మొదలైంది. ప్రత్యేకించి మహిళలు ఈ సభకు పోటెత్తారు. స్టేడియం పూర్తిగా నిండి పోవటంతో బయటనే వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండిపోయారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అత్యంత క్రమశిక్షణ తో ఈ సభ పూర్తి కావటంతో అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఇందుకు ఎ పిఎ న్ జి ఓ సంఘం నాయకులను మనసారా అభినందించాల్సిందే.

కాగా ఇంత భారీయెత్తున జరిగిన ఈ సభలో రాజకీయపార్టీల ప్రమేయం గానీ, రాజకీయ నాయకుల ప్రవేశం గానీ లేకపోవటం విశేషం. సభికుల ఉపన్యాసాలలో కూడా ఎక్కడా ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా సంయమనం పాటించటం అభినందనీయం. రాష్ట్రవిభజన అంశాన్ని వెనక్కు తీసుకోవలసిన అవసరాన్ని ఈ సభ కాంగ్రెస్ అధిష్టానానికి బలంగా చెప్పగలిగిందనటం నిస్సందేహం. ఒకవేళమొండిగా విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవటం జరిగితే సీమాంధ్ర ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావటం తధ్యమని ఈ సభ స్పష్టం చేసింది. ఇదిలావుండగా కేవలం సీమాంధ్ర నుంచే కాక హైదరాబాద్, సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలనుంచి కూడా ఈ సభకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరు కావటం గమనార్హం.