రాజీనామాలు ఆమోదింపజేసుకుంటారా.. ?

ganta erasuసీమాంధ్ర మంత్రులు తమ రాజీనామాలు ఆమోదింపచేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. విభజన ప్రకటనకు వ్యతిరేకంగా చేసిన రాజీనామాలపై నేడు మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఆ తరవాత రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. అయితే, రాజీనామాలు చేసినా.. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని గంటా స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే తెలంగాణపై శాసనసభలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతనెల గంటాతో పాటు మంత్రులు విశ్వరూప్, ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మంత్రులు మరోసారి రాజీనామాల అంశం తెరపైకి తీసుకురావడంతో.. రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గంటాతో పాటుగా ఒక్కరిద్దరు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదింపజేసుకుంటే.. ఆ ఒత్తిడి మిగతా సీమాంధ్ర మంత్రులపైన పడి కచ్చితంగా మంత్రిపదవులకు రాజీనామాలు చేసే పరిస్థితి వస్తుందని గంటా బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రితో ఎప్పుడూ టచ్ లో వుండే గంటా, కేంద్రమంత్రి చిరంజీవికి అనుచరుడే. దీంతో.. రాజీనామాల ప్రస్తావన వెనుక జబర్ దస్త్ వ్యూహమే వుండవచ్చని రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు.