సీమాంధ్రుల వేదన అరణ్యరోదనేనా ?

seemandraరాష్ట్రవిభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ డ్రామా కొనసాగుతూనేవుంది. రాష్ట్రాన్ని విభజిస్తూ సి డబ్ల్యూ సి నిర్ణయం వెలువడిన వెంటనే రాయలసీమ, ఆంద్ర ప్రాంతాలలో నిరసన ఉద్యమం ఎవరూ ఊహించని రీతిలో ఉవ్వెత్తున ఎగసిపడింది. 13 జిల్లాలకు చెందిన ప్రజలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్చంగా, స్వచ్చందంగా రోడ్డు మీదకు వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ నిరసన జ్వాలలు చూసిన కాంగ్రెస్ ఉద్యమ వేడిపై నీళ్ళు చల్లేందుకు గానూ ఆంటోని కమిటీ ని నియమిస్తున్నట్టు ప్రకటించింది. విభజన విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు, సంశయాలు వున్నా ఈ ఆంటోని కమిటి కి చెప్పుకోవచ్చునని కాంగ్రెస్ వెల్లడించింది. అందరి అభిప్రాయాలను విన్న ఆంటోని కమిటీ తన నివేదికను అధిష్టానానికి సమర్పిస్తుందని, ఆ తరువాతే విభజనకు సంబంధించి తుది నిర్ణయం గైకొంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. దాంతో ఈ కమిటీ కి తమ అభిప్రాయాలు, తమ ప్రాంత పరిస్థితులు చెప్పుకోగలిగితే విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ వెనక్కు తీసుకుంటుందని సమైక్య వాదులు , కాంగ్రెస్ సీమాంద్ర నాయకులు భావించారు. ఆ నమ్మకంతోనే సోమ, మంగళ వారాల్లో తెలంగాణా, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆంటోని కమిటీని కలిశారు. విచిత్రం ఏమిటంటే విభజన ఏర్పాటు ప్రక్రియకూ, ఆంటోని కమిటి ఏర్పాటుకూ ఎలాంటి సంబంధం లేదంటూ డిగ్గీ రాజా ప్రకటించటంతో కాంగ్రెస్ నైజం బయటపడింది.

కాగా కమిటీ ముందు హాజరయినతరువాత తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చాలా హుషారుగా వుండగా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం పూర్తి నిరుత్సాహంగా, అసంతృప్తిగా వున్నారు. తాము చెప్పింది మొత్తం అంటోని కమిటీ ఎలాంటి భావాలు లేకుండా మౌనంగా విన్నదని, ఎటువంటి ప్రశ్నలు వేయటం గానీ, ఏ విధమైన స్పందన గానీ లేకుండా చాలా నిరాసక్తంగా ఆలకించిందని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు దిగాలుగా చెప్పారు. పైగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి విభజన అనంతరం సంభవించగల ప్రమాదాలను వివరించబోతే ” ఆ విషయాలన్నీ సోనియా గాంధి తో చెప్పుకోండి ” అనే సలహా కూడా అంటోని కమిటీ ఇవ్వడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే అంటోని కమిటీ ని నియమించిందని, ఈ ఏర్పాటు వెనుక ఎటువంటి చిత్తశుద్ధి లేదని, ఇది ప్రజలను మోసగించటం మాత్రమేనని అన్ని పార్టీ ల నాయకులు మండిపడుతున్నారు. విభజన నిర్ణయం ఫలితంగా రాయలసీమ, ఆంద్ర ప్రాంతాలలో తమ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ ఎందుకింత మొండిగా వ్యవహరిస్తోందో తెలియక కాంగ్రెస్ స్థానికనాయకత్వం తల పట్టుకుంటోంది. ఏతా వాతా తేలింది ఏమిటంటే ఆంటోని కమిటీ ముందు ఎవరు ఎంత మొత్తుకున్నా ఫలితం శూన్యమని, నిర్ణయం జరిగిపోయిందని……. !