అంటోని కమిటి కాంగ్రెస్ డ్రామాయేనా ?

digvijay-singh-sonia-gandhiరాష్ట్రవిభజన విషయంలో సీమాంధ్ర ప్రజల సందేహాలను వినేందుకుగానూ కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా నియమించిన ఆంటోని కమిటీ అంతా బోగస్ అనే అభిప్రాయం క్రమేపీ బలపడుతోంది. డిల్లీ లో జరుగుతున్న పరిణామాలు, దిగ్విజయ్ సింగ్ ప్రకటనల తో బాటు తాజాగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. ” ఆంటోని కమిటీని ఏర్పాటు చేసాం. మీ గోడు ఆ కమిటి ముందు వెళ్ళబోసుకోండి. ” అంటూ కాంగ్రెస్ పార్టి సీమాంధ్ర ప్రాంతానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. పైగా ఆంటోని గారు, ఇతర కమిటి సభ్యులు  డిల్లీ లో చాలా బిజీ గా వున్నారు… వాళ్ళు హైదరాబాద్ కు రాలేరు. మీకు అవసరమైతే మీరే డిల్లీ వచ్చి చెప్పుకోండి. అంటూ చిన్న వెసులుబాటు కూడా కల్పించారు. రెండ్రోజుల తరువాత ” సరేలే… కమిటి ఏదో ఒకపూట కమిటి హైదరాబాద్ వస్తుందిలే ” అంటూ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ” ఆంటోని కమిటీ అంటే పార్టీ కమిటీకదా? అలా కాకుండా చట్ట బద్ధమైన ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేస్తే విశ్వసనీయత వుంటుంది కదా ? ” అన్న సలహాలను, సూచనలను ముందు ససేమిరా అన్న డిగ్గి రాజా వారు ఆ తరువాత ” అలా ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు… నాకు అభ్యంతరం కూడా లేదు ” అంటూ సెలవిచ్చారు.

దిగ్విజయ్ సింగ్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఆంటోని కమిటి అస్తిత్వం, నిజాయితీ లపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. ఇది కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజల కంటి తుడుపు కోసం మాత్రమే నెలకొల్పారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్టుగా తాజాగా బొత్స మాట్లాడుతూ ” ఆంటోని కమిటీ కి విభజన ప్రక్రియకు సంబంధం లేదు. దేని దారి దానిదే… కేవలం సీమాంధ్రుల సమస్యలు తెలుసుకునేందుకే ఆంటోని కమిటి” అంటూ కొత్త రహస్యాన్ని బైట పెట్టారు. ” అన్నారు. దీంతో ఆంటోని కమిటీ ఏర్పాటు కేవలం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలావుండగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపిలు ఆంటోని కమిటి ముందు హాజరయి విభజన అంశాన్ని పునఃపరిశీలించవలసిందిగా అందుకు ఆంటోని నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు తెలిసింది. ” విభజన నిర్ణయాన్ని మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు. అది అయిపోయిన ముచ్చట. దాని తాలూకు రాజ్యాంగ ప్రక్రియ జరిగిపోతోంది. ఆ విషయం కాకుండా ఇంకేదైనా చెప్పండి” అని ఆంటోని నిష్కర్షగా చెప్పినట్టు సమాచారం. నిర్ణయం జరిగిపోయి, ఇక చేసేదేమీ లేనప్పుడు ఈ ఆంటోని కమిటి దేనికి ? ఈ మీటింగులు దేనికి? కమిటీకి సంబంధించి ఈ బిల్డప్పులు ఎందుకు ? అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు?