తెలుగుజాతి ఐక్యతను కాపాడుకోవాలి

D.-srinivasతెలుగుజాతి ఐక్యతను కాపాడుకోవాలని, రాష్ట్రాలుగా విడిపోయినా.. ఒకే జాతిగా కలిసుందామని మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) డీఎస్ విలేకరులతో మాట్లాడుతూ..  పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే విభజన జరుగుతుందన్నారు. ఐదు దశాబ్దాల్లో ఒక్క ఒప్పందం కూడా అమలు కాలేదని.. అందువల్లే తెలంగాణ ఆకాంక్ష పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. 12 సంవత్సరాలుగా సంప్రదింపులుగా ప్రక్రియ జరిపిన తరువాతే విభజనకు కేంద్ర నాయకత్వం పూనుకుందని చెప్పారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకునే అవకాశమే లేదని డీఎస్ స్పష్టం చేశారు.  

కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకంలో సమస్యలుండవని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలుగువారు తెలివైన వారని గుర్తు చేశారు.ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉన్నారని డీఎస్ గుర్తు చేశారు. తెలుగు ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు 15 రోజులుగా తగ్గుతున్నాయని,  విభజన వల్ల సమస్యలు, ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు.