ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయ విభజన

Telangana-regionసంపూర్తిగా రాష్ట్రవిభజన అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా మారిపోయింది. కోర్ కమిటి మీటింగులు సి డబ్ల్యూ నిర్ణయాల దగ్గరనుంచీ ప్రతీదశ లోనూ రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ సాక్షిగా ఈ వ్యవహారం కాంగ్రెస్ స్వంత వ్యవహారంగా మారిపోయింది. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో నిర్ణయం గైకొందంటూ ఇప్పటికే విమర్శలు ఎగసిపడుతున్నాయి. ఒక రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇరుప్రాంతాలకు సామాన్యం అనే సూత్రాన్ని పాటించకుండా కేవలం ఈ విభజన వల్ల తెలంగాణా లో ఒనగూరే ప్రయోజనాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందామనే ఆత్రుత లో కాంగ్రెస్ గైకొన్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయి. కాగా రాష్ట్ర విభజన అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని సోనియా గాంధినో, దిగ్విజయ్ సింగో నిర్ణయించలేరని వారు పేర్కొంటున్నారు. సీమాంధ్ర ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యే బాధ్యత వహించాలని కూడా వారు అంటున్నారు. టి ఆర్ ఎస్ పార్టీ ని తమ పార్టీ లో కలుపుకునేందుకు తెలుగువారిని రెండుగా విడదీశారాణి ఆందోళనకారులు ధ్వజమెత్తుతున్నారు.

” మా భవిష్యత్తును డిల్లీ లో కూర్చున్న కాంగ్రెస్ నాయకులు నిర్దెశిస్తారా ” అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న ఆందోళనకారులకు ఆంటోని కమిటి ఏర్పాటు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన ప్రాతినిధ్యం లేకపోవటమే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు వుండటం తెలుగువారిని అవమానించటమేనని. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరచటమేనని అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగువారు భావిస్తున్నారు. ఏ కేంద్రప్రభుత్వ కమిటీయో, లేక అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యంతో కూడిన కమిటీయో , అదీకాకపోతే ఏ జ్యుడిషియరి కమిటీయో అయితే అందరూ వెళ్లి తమ అభిప్రాయాలను, సమస్యలను ఆ కమిటికి వివరించేవారని, అలాకాకుండా ఒక పార్టీ కి చెందిన కమిటీ ముందు తమ గోడు వెళ్ళబొసుకునే ఖర్మ తమకు ఏమిటని ఇరు ప్రాంతాల  వారి అభిప్రాయంగా కనపడుతోంది. ఇప్పటికే ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆంటోని కమిటీ ముందుకు వెళ్లి తాము మోకాళ్ళమీద సాగిలపడలేమని, ఇది యావత్ రాష్ట్ర ప్రజలను అవహేళన చేయటమేనని అన్నారు. ఇతర పార్టీలు, సంఘాలు కూడా చంద్రబాబు వాదనతో ఏకీభవిస్తుండటం విశేషం. ఇదిలావుండగా మైకులు కనిపిస్తే పూటకో రకంగా మాట్లాడే దిగ్గిరాజా మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా వినోదాన్ని చూస్తున్నారన్న విమర్శ సర్వత్రా వినపడుతోంది.