ముఖ్యమంత్రికి ఉద్వాసన తప్పదా ?

cm kiranmరాష్ట్ర విభజన అంశంపై కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలు చెప్పి అధిష్టానాన్నిచిక్కుల్లో పడేసిన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రానున్న రెండు మూడు రోజుల్లో ఉద్వాసన తప్పదేమోనన్న అభిప్రాయాలు సర్వత్రా వెల్లడవుతున్నాయి. కోర్ కమిటి సమావేశంలో అధిష్టానం సమైక్యాంధ్ర కె కట్టుబడి ఉండాలన్న తన వాదనను పెడచెవిని పెట్టడమే కాకుండా ఏకపక్షంగా రాష్ట్రవిభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో ఖిన్నుడైన ముఖ్యమంత్రి అప్పటినుండి నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. తెలంగాణా అనుకూల నిర్ణయం నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా తొమ్మిది రోజులపాటు ఆయన నిశ్శబ్దాన్ని వీడలేదు. తన దగ్గరకు వచ్చి నిలదీస్తున్న సీమ,ఆంద్ర ప్రాంతాల మంత్రులు, ఎం లు, ఎమ్మెల్ల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సమాధానం చెప్పలేక, వారిని అనునయించలేక, తన నసులో వున్న విషయాలను బైటికి చెప్పలేక సతమతమైపోయినట్లు తెలిసింది. తాను ఎంతగా ప్రయత్నించినా రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిరంకుశంగా వ్యవహరించిందన్న బాధతో ఆయన వున్నారు. ఒక రాష్ట్రాన్ని రెండుగా చీలుస్థున్న తరుణంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నవ్యక్తి అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోకపోవటం దారుణమని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.

పదవి, పార్టీ సంగతి ఎలావున్నా ఈ విభజన నిర్ణయం కారణంగా తాను తన స్వంత నియోజకవర్గానికి కూడా వెళ్ళలేని దుస్థితి నెలకొనడం పట్ల ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. తన కళ్ళముందే, తన హయాంలోనే రాష్ట్రం రెండుగా చీలిపోవటం ఇష్టంలేకనే ముఖ్యమంత్రి గురువారం నాడు మీడియా ముందు తన వాదనను వెళ్ళగక్కినట్టు తెలిసింది. తాను ఇలా మాట్లాడటం వాళ్ళ తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తం అవుతుందని తెలిసినప్పటికీ, అన్నిటికి సిద్ధపడే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం గైకోన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఆయన ఊహించినట్టుగానే తెలంగాణా కు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ తో బాటు పలువురు నాయకులు కిరణ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నానా దుర్భాషలాడారు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని అధిష్టానాన్ని డిమాండ్ చేసారు.

కిరణ్ కుమార్ వ్యవహారంపై అధిష్టానం చాలా సీరియస్ గా వున్నట్టు సమాచారం. వెంటనే ఆయన రాజీనామాను అధిష్టానం కోరవచ్చని తెలుస్తోంది. అలాకాకుండా ఆయనను బర్తరఫ్ చేస్తే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారటమే కాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కిరణ్ పెద్ద హీరోగా మారిపోతాడని, సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తిగా ఆ ప్రాంతం ఆయనకు జేజేలు పలుకుతుండానే భావనతో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందని డిల్లీ సమాచారం. అలాకాకుండా కొంతకాలం పాటు కిరణ్ నే కొనసాగించితే అధిష్టానం రాష్ట్రంపై తన పట్టుకోల్పోయే ప్రమాదం కూడా వుంది. ఇప్పటికే రాష్ట్రవిభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఆంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తిసుకుంటుందో వేచిచూడాల్సిందే.