రైలురోకో చేస్తే కఠిన చర్యలు..!

DGP Dinesh reddy commentsసమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రైలురోకో చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ దినేష్‌ రెడ్డి హెచ్చరించారు. రైల్వే  ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈరోజు ఉదయం డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమ ముసుగులో జాతీయ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేశామని, వాటికి సంబంధించి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని డీజీపీ తెలిపారు. సమైక్యవాదులు హైదరాబాద్‌లో నిర్వాహించాలనుకుంటున్న ర్యాలీకి అనుమతిలేదని ఆయన అన్నారు. శాంతియుత నిరసనలను అడ్డుకోబోమని, విధ్వంసాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీసులకు ప్రాంతీయ పక్షపాతం ఉండదని.. తెలంగాణ ప్రకటనకు 15 రోజుల ముందే సీమాంధ్ర జిల్లాలో పోలీసులను అప్రమత్తం చేశామని, విధ్వంసాలు జరుగకుండా ఆపగలిగామని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు.