తెలంగాణా రాష్ట్రవిభజన కు సంబంధించి మంగళవారం నాడు కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం గైకోనబోతున్న నేపధ్యంలో అందరిముందు ” హైదరాబాద్ ను ఏం చేయబోతున్నారు ” అన్న ప్రశ్న నిలువెత్తున నిలిచింది. సమైక్యాంధ్ర కోరుకునేవారికి రాష్ట్రవిభజన నిర్ణయం బాదాకరమైనప్పటికీ డిల్లీ పరిణామాలు సంపూర్తిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉండటంతో అందుకు అనుగుణంగా వారు మానసికంగా సిద్ధం కాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్ ను మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా ? లేక హైదరాబాద్ ను కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతారా ? అదీకాకుండా హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణాను ప్రకటిస్తారా ? అన్న ప్రశ్నలు సమాధానం కోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏది జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్న చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి జంటనగరాలలో వున్న సెటిలర్స్ ఈ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అయితే ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాని ఉద్యమాన్ని వేడెక్కించటంలో భాగంగా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు చేసిన ప్రసంగాలు ఈ భయానికి కారణమని వారు చెబుతున్నారు.