సర్పంచ్ అభ్యర్థులకు పోటీ భళా..!

apరాష్ట్రంలో స్థానిక సంస్థల హడావుడి మొదలైంది. పల్లెలు ఎన్నికల కోలాహలంతో కళకలాడుతున్నాయి. గ్రామాల్లో రాజకీయ చైతన్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఊరి పెద్దలు, నిరక్ష్యరాస్యులు, అగ్రకూలాల వారే ఎక్కువగా సర్పంచ్ అభ్యర్థిగా పంచాయితీ ఎన్నికల బరిలో నిలబడేవారు. ప్రస్తుతం పరిస్థితిమారింది. విద్యావంతులు ముందుకొచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాజకీయ చైతన్యంతో.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షను ప్రజలు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల విరామం తరవాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులతో పోల్చి చూస్తే సర్పంచ్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవికి సగటున ఆరుగురు వరకు పోటీ పడుతుంటే… వార్డు సభ్యుల విషయంలో సగటు మూడులోపు ఉంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవి కోసం సగటున 7.76 శాతం మంది పోటీ పడుతుండగా, అతితక్కువుగా శ్రీకాకుళం జిల్లా నుంచి 4.98 మంది పోటీ పడుతున్నారు. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలోఅత్యధికంగా ఒక్కో వార్డుకు సగటున 3.22 శాతం మంది పోటీ పడుతుంటే, చిత్తూరు జిల్లాలో అతి తక్కువగా 1.87శాతం మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 21441 పంచాయతీలకు లక్షా 29వేల 5గురు పోటీ పడుతుండగా, రెండు లక్షల 16వేల 988 వార్డులకు ఐదు లక్షల 66వేల 446 మంది పోటీలోఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది.