బూచాళ్ళొస్తున్నారు !

పల్లెల్లో మొదలైందట
కురుక్షేత్ర సమరం !
ఎగిరిందట ఊళ్ళ మీద
ఎలెక్షన్ల భ్రమరం !!

నాయకులకు జనంపైన
తాజాగా మమకారం !
ప్రశాంతతను కోల్పోయే
గ్రామ సీమ ప్రాకారం !!

అబద్ధాల పళ్ళెంలో
నెరవేరని ప్రామీసులు !
అసత్యాల తాకిడితో
నిరంతరం ప్రాక్టిసులు !!

జనమే మారాజులంటు
అరచేతిలొ స్వర్గం !
బతుకులు మారుస్తామంటూ
మేలిముసుగు దుర్మార్గం !!

– ఏవీయస్