చాలా కాలం తరవాత సూర్య ఖాతాలో ఓ హిట్ చేరింది. తొలి రోజు తెలుగు, తమిళ భాషల్లో కలసి సింగం రూ.30 కోట్లు వసూలు చేసిందట. సింగం ప్రభంజనానికి ఇదే నిదర్శనం. ఈ సందర్భంగా సింగం సక్సెస్‌మీట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ”ఈ సినిమాకి వస్తున్న ఫీడ్ బ్యాక్ చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. గత సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రతి సినిమా 100% బాగుంది అని చెప్పలేం. ఏవో కొన్ని లోపాలుంటాయ్. కానీ మా వంతు కష్టం ఎప్పుడూ పడుతుంటాం. అది ఈ సినిమాకి సరైన ఫలితాన్ని తీసుకొచ్చేలా చేసింది. మా అమ్మకు సాధారణంగా సినిమాలు నచ్చవు. కానీ ఈ సినిమా చూస్తూ మనస్ఫూర్తిగా నవ్వుకొంది. జ్యోతిక కళ్లలో ఆనందం కనిపించింది. ఈ విజయం దర్శకుడిదే. ఎందుకంటే ఇంతమంది ఆలోచనల్ని సరైన దారిలోపెట్టి, అందరినీ సక్రమంగా ముందుకు నడిపించింది ఆయనే” అన్నారు. త్వరలోనే సింగం 3 కూడా వస్తుందని చిత్ర సమర్పకుడు జ్ఞానవేల్‌రాజా చెప్పారు.