ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టుగా ఎటువంటి దాపరికం లేకుండా చెప్పేసే గుణం హీరో నందమూరి బాలకృష్ణ ది. ఈ విషయంలో ఆయన అనేకమార్లు వివాదాస్పదమయ్యారు కూడా. అయినా స్వతహాగా తనకున్న నిజాన్ని ఆయన మార్చుకోలేదు. ప్రత్యక్ష రాజకీయాలలోకి రాబోతున్నానని, తన వారసుడిగా తన తనయుడి ని చిత్ర పరిశ్రమకు అందిస్తానని, పూర్తిస్తాయిగా ప్రజాసేవకే తాను అంకితమవుతానని, ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నుంచి అసెంబ్లీ కి పోటీ చేస్తానని కొంతకాలం క్రితం ప్రకటించి రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన బాలకృష్ణ తాజాగా అమెరికా లో చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికా లోని తెలుగుసంఘాల వారు ఆయనకు జీవన సాఫల్య పురస్కారం తో రెండ్రోజుల క్రితమే అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడు నందమూరి తారక రామారావు తనయుడిగా అందరూ తనను నటుడిగానే చూడాలని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకు తాను జీవితాంతం నటుడిగానే కొనసాగుతానని, ఆ తరువాతనే మరేదైనా ఆలోచిస్తానని ప్రకటించారు. ఈ స్టేట్ మెంట్ ఏదో యాదాలాపంగా చేసారని అనుకోవాలా ? లేక ముందుగా అనుకునే ఇలా మాట్లాడారా అన్నది తేలాల్సి వుంది. నందమూరి ఫ్యామిలీ లో కేవలం ఒక్క బాలకృష్ణ మాత్రమే చంద్రబాబుకు అండగా ఉంటూ వస్తున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్ టీ ఆర్ లు బాబుకు సన్నిహితంగా లేరు. బాబు కూడా వారిని వ్యూహాత్మకంగా దూరంగా ఉంచుతున్నారు. ఈ నేపధ్యంలో బాలయ్య కూడా పై ప్రకటనకు అనుకూలంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తే మొత్తం నందమూరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ దూరమయ్యే ప్రమాదం వుంది. బాలయ్య ప్రకటన దేశం రాజకీయాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.