ఇదేనా పాలన అంటే?

cm kiranmసమర్థుడైన నాయకుడు ఇతరుల సమర్ధతను కచ్చితంగా గుర్తిస్తాడు. వారి సమర్ధత ఏ మేరకు వాడుకోవాలో, అంతా వాడుకుంటాడు. వారిని తన నియంత్రణలో వుంచుకుంటూనే, తనకు పనికివచ్చేలా ఉపయోగించుకుంటాడు. ఇదే ఆడ్మినిష్ర్టేషన్ అంటే. తరచు జనాలు ఒక మాట అంటూ వుంటారు. చంద్రబాబు మంచి ఆడ్మినిస్ర్టేటర్ అని. ఆ మాటకు వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తనకు అనుకూలమైన వారికి అవకాశం ఇస్తూనే, పనిచేసే వారికి కూడా ప్రోత్సహించేవారు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ వ్యవహారం అలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఐఎఎస్ ల బదిలీలు చూస్తుంటే, అయ్యో అనిపిస్తోంది. నాగులాపల్లి శ్రీకాంత్ సమర్థుడైన యువ ఐఎఎస్ అధికారి. వైఎస్ హయాంలో, పాలకవర్గం లేని కాలంలో, సుదూర దృష్టితో విశాఖ నగర రూపు రేఖలు మార్చిన అధికారి. రూపాయి అవినీతి తెలియనివాడు. ఇటీవల కొంత కాలంగా ఖాళీగా వుంచారు. ఇప్పుడు కరుణించి నెల్లూరు కలెక్టర్ గా పంపారు. రామాంజనేయులు విశాఖలో పాలకవర్గం పదవీకాలం ముగిసాక, తన పనితనం చూపినవాడు. కొత్త కొత్త ఆలోచనలు చేసినవాడు. అక్కడి ప్రజాప్రతినిధులతో పొసగలేదు. కార్మికశాఖలో పడేసారు. ఇప్పుడు అక్కడా వుంచకుండా అప్రధాన్య శాఖకు బదిలీ చేసారు. అసలు అటువంటి శాఖ ఒకటి వుందని కూడా ఎవరికీ తెలియదు. పూనం మాలకొండయ్య. జగమెరిగిన అధికారి. ఎక్కడ నియమిస్తే అక్కడ సంచలనం. ముక్కుసూటి మనిషి. పాపం ఇప్పుడామెకు పోస్టింగ్ కరువయింది. ఇలాగే వున్నాయి మిగిలిన పోస్టింగులు కూడా. మరి సమర్థులైన అధికారులను వాడుకోకుండా, అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డించుకుంటూ పోతే, పాలన ఏమంత బాగుటుంది మరి?