రోజా పై దారుణమైన జోకుల ‘ జబర్దస్త్ ‘ !

rojaఈ టీవీ లో ప్రతి గురువారం ప్రసారమవుతున్న బూతుల హాస్య కార్యక్రమం ” జబర్దస్త్ “లో జోకులన్నీ నాగబాబు, రోజా, మేనేజర్ ఏడుకొండలు అనే వ్యక్తి మీదనే కేంద్రీకృతం కావటంతో ఆయా జోకుల్లో పస లేకపోవటంతో బాటు ప్రోగ్రాం యావత్తూ ఎబ్బెట్టుగా మారిపోతోంది. జుగుప్సాకరమైన జోకులు, అధిక శాతం జోకులలో ఆర్టిస్టు లందరూ ఆడవేషాలు ధరించటంతో ఈ కార్యక్రమం చూడాలన్న ఆసక్తి క్రమేపీ తగ్గుతోంది. బలవంతపు బ్రాహ్మణార్ధం టైపులో నవ్వు రాకపోయినా నాగబాబు, రోజాలు అతి కష్టంపైన కృత్రిమంగా నవ్వటం కూడా చూపరులకు చాలా చికాకు తెప్పిస్తోంది. ప్రత్యేకించి రోజా మీద ఆర్టిస్టులు వేస్తున్న జోకులు ఆమె ఇమేజ్ ను, గ్లామర్ ను దారుణంగా దెబ్బతీసేలా ఉంటున్నాయి. జోకులలో “దేశం లో వున్న మేకప్ మెటిరియల్ మొత్తం రోజా ఇంట్లోనే వుందంటగా ” “ఇక్కడున్న పెద్ద మట్టి కుప్ప రోజా తీసేసిన మేకప్ తాలుకు” “నవ్వు రాకపోయినా నవ్వటానికి నేనేమైనా రోజా నా ఏమిటి ?” “ఇంట్లో మొగుడిని భద్రంగా పెట్టుకుని ఇంకో సెటప్ పెట్టుకునే గట్స్ రోజా కే వున్నాయి” లాంటి డైలాగులు ఆమెకు ఇబ్బందికరంగా వున్నా ఆమె మాత్రం మొహమాటం కోసం నవ్వేస్తూ స్పోర్టివ్ గానే తీసుకుంటున్నారు. పైగా రెమ్యూనరేషన్ తిసుకుంటోంది కాబట్టి తప్పని సరిగా నవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే టీవీ షో లలో గంతులేస్తోందని, హుందా లేకుండా ప్రవర్తిస్తోందని రోజా పై రాజకీయంగా అన్ని పార్టీలు విమర్సల వర్షం గుప్పిస్తున్నాయి. ఈ దశలో ఈ జబర్దస్త్ కార్యక్రమంలో ఆమె పై పేలుతున్న జోకులు ఆమెను మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చనిపిస్తోంది. అయినా జడ్జిలుగా కూర్చోబెట్టి వారి పైనే జోకులు వేయటం, వారిని ఇబ్బందులపాలు చేయటం నిర్వాహకులకు కూడా సబబు కాదు.