అనుమతి సాధ్యం కాదంటున్న.. అనురాగ్ !

cp-anurag-sharmaఈ నెల 14న తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన “ఛలో అసెంబ్లీ”కి అనుమతి సాధ్యం కాదని నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ’ఛలో అసెంబ్లీ’  భద్రతా ఏర్పాట్లపై శర్మ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలుకు వివిధ రకాలైన
వ్యక్తులు హాజరవుతుంటారని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే “ఛలో అసెంబ్లీ”కి అనుమతి ఇవ్వట్లేదని తెలిపారు. అంతేకాకుండా, ఛలో అసెంబ్లీ ని మిలిటెంట్ ఉద్యమంగా మార్చేందుకు మావోయిస్టు నాయకుడు పిలుపుఇచ్చారని.. ఇలాంటి ప్రకటన చూస్తుంటే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని సీపీ
పేర్కొన్నారు.

కాగా, సాగరహారం సందర్భంగా 34 కేసులు నమోదు చేసామని, మిలియన్ మార్చ్, సమరదీక్ష సందర్భంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయని  శర్మ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టే ’ఛలో అసెంబ్లీ’ కి అనుమతి సాధ్యం కాదని వెల్లడించారు. అయితే, జేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలు ఇప్పటికీ ’ఛలో అసెంబ్లీ’ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున, శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారిని గుర్తించేందుకు నిఘా కేమెరాలు, వీడియో రికార్డింగులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శాసనసభకు
రెండు కిలోమీటర్ల మేర ఇప్పటికే ఆంక్షలు అమలులోఉన్నాయని శర్మ తెలిపారు.