14 న టి-జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’

kodandaram tjacప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని మరోసారి ఉద్ధృతం చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. శాసన సభ రెండోవిడత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జూన్ 14 న ’ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. బుధవారం టీఎస్ జీవో భవన్ లో జరిగిన టీ-జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణవాదులు లక్షలాదిగా వచ్చి ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని ఐకాస చైర్మెన్ ప్రొ. కోదండరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి జేఏసీ జూన్ 1 నుంచి ప్రచార యాత్రను చేపట్టనున్నట్లు
కోదండరాం తెలిపారు. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెరాస అధినేత కేసీఆర్, భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, స్వామిగౌడ్ తదితరులు హాజరయ్యారు.