జూనియర్ వర్సెస్ ఎన్.టి.ఆర్

ntr tarakaratnaరెండురోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతంగా జరిగినట్లేనని చెప్పాలి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలతో గండిపేట పసుపుమయంగా మారింది. ఎక్కడా ఎటువంటి అపశ్రుతి లేకుండా చక్కటి టీం వర్క్ తో రెండురోజుల సభలను వైభవంగా నిర్వహించటంలో దేశం నాయకులు సక్సెస్ అయ్యారు. అయితే ఒక్క నందమూరి బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబ సభ్యులెవరూ ఈ మహానాడు లో ఉత్సాహంగా పాల్గొన్న దాఖలాలు లేవు. గతకొంతకాలంగా చంద్రబాబు కు దూరంగా ఉంటున్న నందమూరి హరికృష్ణ సినీ హిరో జూనియర్ ఎన్ టి ఆర్ కూడా మహానాడు లో పాల్గొంటారా లేదా అన్నది అటు క్యాడర్ లోనూ, ఇటు మీడియా లోనూ ఆసక్తికరమైన అంశంగా మారింది. మొదటి రోజున పాల్గొన్న హరికృష్ణ ఉన్న కొద్దిసేపు ఏదో మొక్కుబడిగా పాల్గొన్నట్టు కనిపించింది. ఆయన ముఖంలో నవ్వు ఫ్లడ్ లైట్లు వేసి వెతికినా కనిపించలేదు. వేదిక మిద కూడా రెండవ వరసలో ఒక మూలగా ఆయన కూర్చున్నారు. ఆయన ను ముందు వరసలో కూర్చోపెట్టేందుకు అక్కడి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆయన వద్దకు వెళ్లి ” రండి ముందు వరసలో కూర్చోండి ” అని సాదరంగా పిలిచారు. ” ఎందుకండీ…. నా స్థానం నాకు తెలుసు…  ముందువరసలో కూర్చుంటే ఎవరైనా పెద్ద నాయకుడు వస్తే లేపెస్తారు. ఈ సీటు అయితే ఆ ప్రమాదం లేదు ” అని హరికృష్ణ సమాధానం ఇచ్చారు.

ఇదిలావుండగా జూనియర్ మాత్రం ఈ మహానాడు కు సంపూర్ణంగా డుమ్మా కొట్టారు. కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో జూనియర్ మాట్లాడుతూ ” నా ఒంట్లో ప్రవహిస్తోంది స్వర్గీయ రామారావు గారి రక్తం. ఆయన స్థాపించిన పార్టీ కే నా సేవలందిస్తా. ఆ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తా ” అని చెప్పారు. అలాంటిది ఆయన
మహానాడుకు గైరుహాజరయ్యారు. మహానాడు కు హాజరు కాకూడదనే ఆయన మలేషియా వెళుతున్నారు అన్న వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే మహానాడు రెండవ రోజయిన 28 వతేదిన ఆయన హైదరాబాద్ లోనే వున్నారు. పొద్దున్నే ఎన్ టి ఆర్ ఘాట్ ను సతీ సమేతంగా సందర్శించి నివాళులు అర్పించారు. పైగా ఒక దినపత్రిక లో ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా ఫుల్ పేజ్ ప్రకటన కూడా ఇచ్చారు. ఈ ప్రకటన ఖర్చు మూలుగా 40 లక్షలు. ఇంతవరకూ బానే వుంది. అయితే మహానాడు కు ఎందుకు హాజరు కాలేదు అన్న ప్రశ్నకు జూనియర్ చెప్పిన సమాధానమే ఆశ్చర్యంగా వుంది. తననెవరూ మహానాడు కు పిలవలేదని, అలాంటప్పుడు ఎలా హాజరు అవుతానని ఆయన అన్నారు. మహానాడు కు ముందు ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు స్వయంగా హరికృష్ణను, జూనియర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అసలు తెలుగుదేశం పార్టీ లో కీలక వ్యక్తిగా జూనియర్ ను ఎవరైనా ప్రత్యేకించి పిలవాలా ? అన్నది ప్రశ్న. రావటం ఇష్టం లేకపోతే మానెయ్యాలి  గాని ఇలాంటి  కుంటి సాకులు కామెడీ గా వుంటాయి అని దేశం కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరో విశేషం ఏవిటంటే జూనియర్ ధోరణిని రామారావు  గారి మరో మనవడు, సినీ హిరో నందమూరి తారకరత్న( ఎన్ టి ఆర్ ) తప్పు పట్టారు తెలుగుదేశం మహానాడు కు నందమూరి  కుటుంబ సభ్యులను ప్రత్యేకించి పిలవనవసరం లేదని, అది నందమూరి కుటుంబ సభ్యుల బాధ్యత అని తారక రత్న అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ  ఎన్ టి ఆర్ గారి కుటుంబ సభ్యులేనని, నందమూరి కుటుంబ సభ్యులు మహానాడు  పాల్గొనటం కనీస బాధ్యత అన్నవిషయం వారు గుర్తించాలని తారకరత్న హితవు చెప్పారు. ఏది ఏమయినా  ఇది పూర్తిగా ఈగొ లకు సంబంధించిన విషయంగా పరిశీలకులు భావిస్తున్నారు. కాగా  పది సినిమాలు చేసిన జూనియర్ కే అంత ఈగొ వుంటే తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కు ఎంత ఈగొ వుండాలని ఒక సీనియర్ దేశం నాయకుడు వ్యాఖ్యానించారు.