వందేళ్ళ సినిమాలో అగ్రస్థానంలో ” మాయాబజార్ “

Mayabazarవందేళ్ళ భారతీయ సినిమా చరిత్రలో అపురూప చలనచిత్ర దృశ్య కావ్యంగా మన ” మాయాబజార్ ” సినిమా సగర్వంగా నిలిచింది. దేశంలోని ఇతర భాషా చిత్రాలన్నిటి లోనూ ‘ మాయాబజార్ ‘ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. 1957 లో విడుదలయిన ఈ చిత్రాన్ని విజయా బ్యానర్ పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించగా, కె. వి. రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కన్నడ, తమిళ భాషల్లో కూడా అనువదించారు. జాతీయ వార్తా చానెల్ ” సి ఎన్ ఎన్ – ఐ బి ఎన్ ” నిర్వహించిన పోల్ లో ” మాయాబజార్ ” తొలిస్థానం దక్కించుకుంది. ఇది తెలుగువారందరికీ గర్వకారణంగా చెప్పుకోదగ్గ  అంశంగా పేర్కొనవచ్చు. భారతం లోని ఒక చిన్న కథను ఇతివృత్తంగా తీసుకుని  నిర్మించిన ఈ చిత్రంలో నటీనటుల ప్రతిభ, దర్శక నైపుణ్యం, సంగీతం, కెమెరా పనితనం, ఎడిటింగ్ లాంటి అన్ని అంశాలు అద్భుతంగా సమకూరాయి. అప్పట్లోనే మల్టీ స్టారర్ గా పేరొందిన ఈ చిత్రంలో ఆ నాటి అగ్ర హీరోలు ఎన్. టి. ఆర్., అక్కినేని కలిసి నటించగా ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు ఒక ప్రధానపాత్రలో నభూతో నభవిష్యతి గా నటించారు. స్వర్గీయ ఘంటసాల సంగీత దర్శకత్వంలో అన్ని సూపర్ హిట్ పాటలు కాగా, ఈ సినిమాకు ఆయన సమకూర్చిన రి-రికార్డింగ్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.