మారుతున్న ఓటరు ఆలోచనలు.. !

karnataka-pollsకర్ణాటకలో అయిదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతకు ముందు కూడా తలకు బొప్పి కట్టించింది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నే ప్రజలు తలకెత్తుకున్నారు? ఎందుకని? ఆదరించి అధికారం చేతికిస్తే, భారతీయ జనతాపార్టీ చేసిన నిర్వాకం చూసి, ముఫై మూడు ముక్కులుగా పార్టీ చీలిపోయిన వ్యవహారాలు గమనించి, చెడ్డలో మంచి చెడ్డ అన్న చందంగా కనీసం స్థిరమైన, పాలన కొనసాగించడం పార్టీ ఏదో ఒకటి అవసరం అన్నది గమనించి మళ్లీ కాంగ్రెస్ ను తలకెత్తుకున్నారు.

ఇప్పుడు మన రాష్ట్రం తీరు కూడా దాదాపు ఇలాగే వుంది. రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ను తలకెత్తుకున్నారు. ఇప్పుడా పార్టీ, రెండు ముక్కులు, మూడు వర్గాలు అన్న చందంగా వుంది. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మరోపక్క పాలనాయంత్రాంగం స్తంభించినట్లు జనాలకు స్పష్టంగా తెలుస్తోంది. రెండు సార్లు అధికారం అప్పగించక ముందు తెలుగుదేశం పాలనను, ఆ తరవాత కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకునే సమయం ఆసన్నమైంది.

ఇటీవల రాజకీయాలు చర్చించడం అలవాటున్న నలుగురు కలిసి మాట్లాడుకుంటే వినిపిస్తున్న మాట చంద్రబాబే బెటర్, కనీసం పాలన అన్నా గాడినా పడుతుంది. అక్కడ కర్ణాటకలో అనుకున్నది అదే. ఇప్పుడు ఆంధ్రా జనం అనుకుంటున్నది అదే. ఇదేమీ పెద్ద ఈక్వేషన్ కాదు. తరచు జ్వరం వస్తుంటే, ఈసారి అల్లోపతి మానేసి, ఆయుర్వేదమో, హోమియోపతీనో ప్రయత్నిద్దామనుకుంటారు. నప్పితే ఓకె. లేదంటే మళ్లీ సర్లే, అదే బెటరు అని వెనుక్కువస్తారు. జనం సైకాలజీ అలాంటిది. అదే కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ను గెలుపు ముంగిట్లో నిలబెట్టింది తప్ప వేరు కాదు. ఆ పార్టీలో వున్నన్ని కుమ్ములాటలు, వుండనే ఉన్నాయి. వాపు చూసి బలము అనుకుంటే కష్టమే. అధికారం వున్నన్నాళ్లు చుట్టూ చేరిన వారిని చూసి, అది తమ ప్రతిభే అనుకోవడం సరికాదని యడ్యూరప్ప, శ్రీరాములు వంటి వారిని చూస్తే అర్థమవుతుంది. వారు బిజెపిని వీడి బయటకు వచ్చి, ఏదో సాధిద్దామనుకుంటే, సీన్ రివర్స్ అయింది. అవినీతిని తాము ఓ కంట గమనిస్తున్నామని జనం శ్రీరాములు పార్టీని ఛీ కొట్టారు. ఇక యడ్యూరప్ప వ్యవహారమూ అంతే అయింది.

ఓకప్పుడు బిజెపిని ఒంటిచేత్తో గెలిపించి, అధికారంలో కూర్చోపెట్టిన యడ్యూరప్ప, ఇప్పుడు నాలుగో వంతు స్థానాలు తెచ్చుకోవడానికి కిందా మీదా పడుతున్నారు. జనం తెలివైనవారు. అంతిమంగా సరియైన తీర్పు ఇవ్వడంలో వారు చరుతులు. ఇదే కర్ణాటక కాదు, ఏ ఎన్నికలైనా చెప్పే పాఠం.