కర్ణాటకలో మొదలైన పోలింగ్ !

karnataka-pollsకర్ణాటక విధానసభకు ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఎండలు అధికంగా ఉండడం వల్ల సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. పోలింగ్ కోసం 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 52,034 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,940 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 170 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 1.35 లక్షల మంది సాయుధ, సాధారణ బలగాల్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు బెంగళూరులోని మల్లేశ్వరం బాలికల పాఠశాలలో ఓటు వేశారు. అటు యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 11 గంటల సమయానికి 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.