సింగపూర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడిన మార్క్ శంకర్ – చిరంజీవి భావోద్వేగ ట్వీట్


పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతడికి చేతులు, కాళ్లు కాలిన గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఉండటంతో ఆయన సింగపూర్ చేరుకోవడం కొంత ఆలస్యమైంది. అయితే ఈలోపు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లి, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దగ్గర నుంచి సమీక్షిస్తూ కుటుంబానికి తోడుగా నిలిచారు.

తాజాగా చిరంజీవి ట్విట్టర్‌లో ఒక భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు:

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా, త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తాడనే ఆశ ఉంది. మా కులదైవం ఆంజనేయ స్వామి కృపతో, అతడిని ఓ పెద్ద ప్రమాదం నుంచి రక్షించగలిగాం. రేపు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా దేశం నలుమూలలా మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి, మా కుటుంబం తరఫున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.