YS Jagan Raptadu Tour : రాష్ట్రంలో బిహార్ తరహా పరిస్థితులు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్


YS Jagan Raptadu Tour : రాప్తాడు ఘటన రాష్ట్ర ప్రజల మనసులను కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దారుణ హత్య రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో స్పష్టంగా చూపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బిహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన పూర్తిగా రెడ్‌బుక్ పాలన నడుస్తుందని విమర్శించిన జగన్, ప్రజలు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయిందని జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపెట్టినా, ప్రలోభాలు చూపినా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 57 స్థానాల్లో 39 స్థానాల్లో వైసీపీ గెలుపొందిందని తెలిపారు. టీడీపీకి బలం లేని ప్రాంతాల్లోనే ఎన్నికలను వాయిదా వేశారని ఆరోపించారు. గెలిచిన ప్రాంతాల్లో టీడీపీ నేతలు హింసకు ప్రోత్సాహం ఇస్తుందని తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు.

రాప్తాడులో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యపై జగన్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డవారు 20 మంది ఉండగా, కేవలం ఇద్దరిపై మాత్రమే కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇక సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పెట్టిన కేసులు కూడా రాజకీయ పగతోనేనని జగన్ ఆరోపించారు. నంది అవార్డుల వ్యవహారంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని అన్నారు. అంతేకాదు, వల్లభనేని వంశీపైనా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.