“లైలా” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృధ్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన తన పాత్ర “మేకల సత్తి” గురించి మాట్లాడుతూ, కథ మొదట్లో తన వద్ద 150 మేకలు ఉన్నాయని, కానీ చివరికి కేవలం 11 మాత్రమే మిగిలినాయని చెప్పాడు. దీన్ని వైఎస్సార్సీపీపై వ్యంగ్యంగా చేసిందిగా చాలా మంది భావించారు. 2019లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, 2024 లో 11 సీట్లకు పరిమితమైందన్న అర్థం వచ్చేలా ఉన్నందుకు ఇది రాజకీయ వ్యాఖ్యగా మారింది. ఈ కారణంగా సోషల్ మీడియాలో #BoycottLaila హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైఎస్సార్సీపీ మద్దతుదారులు “లైలా” సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్ స్పందించి క్షమాపణ చెప్పారు. పృధ్వి రాజ్ మాట్లాడుతున్నప్పుడు తాను, నిర్మాత స్టేజ్‌పై లేరని, చిరంజీవిని ఆహ్వానించేందుకు బయట ఉన్నామని తెలిపారు. సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు సినిమా ప్రమోషన్ కోసం నిర్వహిస్తారే కానీ, రాజకీయ ప్రసంగాలకు వేదిక కాదు అని ఆయన స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ తరవాత ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి. ఫిబ్రవరి 14 న విడుదల కాబోతున్న ఈ సినిమాపై విశ్వక్ సేన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. విశ్వక్ సేన్ కి జోడీగా ఆకాంక్ష శర్మ నటిస్తుంది.