Prema Charitra Krishna Vijayam : జనవరి 3 న విడుదల కానున్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం !!


Prema Charitra Krishna Vijayam : సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం “ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం”. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్–సుహాసిని జంటగా నటించగా.. నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 3, సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు.

“ప్రేమచరిత్ర – కృష్ణ విజయం” కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ పేరు సైతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు.

దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ.. “సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని మధుసూదన్ ఆకాంక్షించారు.