RGUKT Basar : గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కాంపస్ ప్లేస్మెంట్ లో 350 మందికి ఉద్యోగాలు


గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్జీయూకేటీ బాసర ఆశయం నెరవేరుతుంది. ఇక్కడ విద్యార్థులుగా చేర్చే తల్లితండ్రులు చిన్న, సన్న కారు రైతులుగా, కూలి పనులు, గుమాస్తాలు, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి చదివించుకున్న వారే. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి బాసర క్యాంపస్ లో సీట్లు దక్కించుకొని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చదువు పూర్తవ్వగానే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు సాధిస్తున్నారు. 2023 బ్యాచ్ విద్యార్థులు దాదాపు 350 మంది పలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. ఏడాది దాదాపు 55 నుంచి 60 కంపెనీలు ప్లేస్మెంట్స్ నిర్వహించాయి. వీటిలో ఏడాదికి కనిష్టంగా ఐదు లక్షల నుంచి గరిష్టంగా 17 లక్షల ప్యాకేజీ తో ఉద్యోగాలు సాధించారు. ఆర్జీయూకేటీ బాసరను స్థాపించి 15 సంవత్సరాలు పూర్తయింది ఇందులో చదువుకున్న విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించడంతో వేలాది పేద కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ పేర్కొన్నారు.

టి ఎన్ పి సెల్ నిరంతర కృషి:
విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేకంగా కృషి చేస్తుంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్టులు , మాక్ ఇంటర్వ్యూ నిర్వహించడంతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి ప్లేస్మెంట్లు నిర్వహించేలా కృషి చేస్తుంది. యాక్సెంచర్,జిందాల్ SAW(గుజరాత్),అతిబీర్ ఇండస్ట్రీస్ (జార్ఖండ్), Vassar Labs, Hexacluster, Hugo Save తదితర అనేక కంపెనీలు ప్లేస్మెంట్స్ నిర్వహించాయి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన ఐటీసీ, కాగ్నిజెంట్, Arcadis IBI కంపెనీలు సైతం క్యాంపస్ సెలక్షన్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్లేస్మెంట్స్ ఆఫీసర్ మద్దెల నరేందర్, డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, శ్రీమతి సృజన, ఆఫీస్ సిబ్బంది మోహన్ బాబు తదితరులు కృషి చేస్తున్నారు.

ప్రత్యేక శిక్షణతో సిద్ధం చేస్తున్నాం: వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ
ఆర్జీయూకేటీ బాసరలో చదువుతున్న విద్యార్థులకు ప్రాంగణ నియమాకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. దాదాపుగా 60 సాఫ్ట్వేర్ కంపెనీలు కోర్ కంపెనీలు హెచ్ ఆర్ లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. తృతీయ సంవత్సర నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ప్లేస్మెంట్లకు సిద్ధం చేస్తున్నాం.. మాక్ ఇంటర్వ్యూలు ఆన్లైన్ టెస్టులు తరచూ నిర్వహిస్తున్నాం ..ప్రముఖ కంపెనీ క్యాంపస్ సెలక్షన్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్యాంపస్ టు కార్పోరేట్ అనే కొత్త నినాదంతో మరిన్ని ప్లేస్మెంట్స్ కి ప్రయత్నాలు ముమ్మరం చేసాము.